20 సెప్టెంబర్ 2015

ఆకుపచ్చ కొండల్లోనూ గోరువెచ్చ గుండెల్లోనూ వేటూరి పాటే...

సినీ కవి పాండిత్యం పాటలో వెలువడాలంటే ఆ పాట సన్నివేశం ముఖ్యపాత్ర వహిస్తుంది. “ఊటీలో పాడుకోడానికి ఓ డ్యూయట్ రాసివ్వండి” అని అడిగితే ఆ దర్శకుడిమీదా, ఇచ్చిన సన్నివేశంమీదా గౌరవభావం ఎలా కలుగుతుంది? రాయడానికి కవికి ఏం ప్రేరణ కలుగుతుంది?

వేటూరి విశ్వనాథ్ కీ, వంశీకీ, జంధ్యాలకీ ఎక్కువ మంచి పాటలు రాశారంటే కారణం ఆ దర్శకులు చెప్పే సన్నివేశాలు కలిగించే ప్రేరణ!

ఏవో కారణాలవలన వేటూరి, విశ్వనాథ్ మధ్య కొంత మనస్తాపాలొచ్చి కొన్ని ఏళ్ళు కలిసిపనిచెయ్యలేదు. వీరు విడిపోవడంవల్ల జరగిన పెద్ద నష్టాన్ని సిరివెన్నెల సీతారామ శాస్త్రి ద్వారా తెలుగు చిత్రసీమ సరిపెట్టుకుందని చెప్పాలి. విడిపోయిన వారు కలిశాక వచ్చిన తొలి చిత్రంలోని పాటగూర్చిన విశ్లేషణే ఈ సమీక్ష!



కవినీ, దర్శకుణ్ణీ కలపాలని ఓ పెద్దమనిషి కంకణం కట్టుకున్నాడు. అందుకని స్వయంగా సినిమా నిర్మించి వేటూరినీ, విశ్వనాథ్ నీ కలిపారు ఆ పెద్దమనిషి. ఆ సినిమా “శుభసంకల్పం”. మహా నటుడు కమల్‌హాసన్ కథానాయకుడు, విశ్వనాథ్ గారిని కూడా ఓ గొప్పపాత్రలో నటనావతారమెత్తించింది ఈ సినిమా. ఇంతటి శుభసంకల్పానికి పూనుకున్న ఆ పెద్ద మనిషి గానగాంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గారు.

ఇక పాట గురించి చూద్దాం…
ఈ సినిమాలో నాయికా నాయకులు పల్లెటూరి ప్రేమికులు.వాళ్ళకు పెళ్ళి జరుగుతుంది. పెళ్ళయ్యాక పాడుకునే యుగళగీతం. ఆ గీతంలో వాళ్ళ యాస వినిపించాలి, పూర్వం వాళ్ళు ప్రేమికులన్న విషయం వినేవారికి అర్థమవ్వాలి, కొత్తజంట ముచ్చట్లూ, సరసాలూ వినిపించాలి, పాటలోనే కథను కొన్ని నెలలు ముందుకు తీసుకెళ్ళాలి, ఆ పైన అమ్మాయి నెలతప్పిందన్న విషయంకూడా సూచించాలి. ఐదు నిముషాల పాటలో ఇన్ని చెప్పాలి! ఇటువంటి సన్నివేశానికి చెలరేగిపోయి వేటూరి రాసిన పాట ఇది. ట్యూన్ చేశాక పాట రాశారో, పాట రాశాక ట్యూన్ చేశారోకానీ అద్భుతమైన సంగీతమందించారు కీరవాణి గారు. బాలు గారూ, శైలజ గారూ తమ గళంతో ప్రాణం పోశారు ఈ పాటకి.

పాటంతా స్వచ్ఛమైన తెలుగు పదాలే వినబడతాయి.
పల్లవి
ఆమె : మూడుముళ్ళు ఏసినాక చాటులేదు మాటులేదు గూటిబైటే గుట్టులాట
అతడు : ఏడు అంగలేసినాక ఎన్నిలింట కాలుబెట్టి పాడుకుంట ఎంకిపాట
ప్రేమించుకునే రోజుల్లోలాగా ఎవరికంటాపడకుండా చెట్టాపట్టాలేసుకుని తిరగనక్కర్లేదు. మనకి మూడుముళ్ళు పడిపోయాయి, ఇక చాటుమాటులేకుండ గూటిబైటే కబుర్లాడుకోవచ్చండుంది నాయిక. ఏడడుగులు కలిసి నడిచాము, ఏ దిగులూ భయమూ లేకుండ ఎన్నెట్లో ఆడుకోవచ్చు, పాడుకోవచ్చంటున్నాడు నాయకుడు.

భాష గమనించండి! అంగలేయడం(త్వరత్వరగా నడవడం) అన్న పదాన్ని భలే ఉపయోగించారు కవి. ఎంకిపాట – ఈ పదం వినగానే పాట మనగుండెలకు అతిచేరువైపోతుంది; తెలుగుతనమంతా ఈ పదంలోనే ఉందేమో అనిపిస్తుంది.
ఆమె :
ఆకుపచ్చ కొండల్లో గోరువెచ్చ గుండెల్లో
ముక్కుపచ్చలారబెట్టి ముద్దులంట
చరణం 1
అతడు : హే పుష్యమాస మొచ్చింది భోగిమంటలేసింది కొత్తవేడి పుట్టింది గుండెలోన
ఆమె : రేగుమంటపూలకే రెచ్చిపోకే తుమ్మెద
అతడు : కాచుకున్న ఈడునేదోచుకుంటే తుమ్మెదా
ఆమె : మంచుదేవతొచ్చిందా మంచమెక్కికూకుందా
ఆహా అహా ఆహా ఆహా వణుకులమ్మ తిరణాళ్ళే ఓరి నాయనా
అతను :
సీతమ్మోరి సిటికన ఏలు సిలకతొడిగితే సిగ్గులెర్రన
రాములోరు ఆ సిలక కొరికితే సీతమ్మోరి బుగ్గలెర్రన

ధనుర్మాసాన్ని అంధంగా పుష్యమాసం అనడం బాగుంది. భోగిపండుగ ఈ నెల ఆఖరిరోజు వస్తుంది. పుష్యమాసం చలెక్కువకదా? భోగిమంటలను కొత్తజంటల కోరికలతోనూ,  కోరికలను పువ్వులతోనూ, ఆ కోరికల పువ్వులకై ఒకరినొకరు తుమ్మెదల్లా ఆశ్రయించారనీ; వారి కలయికను వణుకులమ్మ తిరణాళ్ళుగా ఎంతబాగా పోల్చారో కవి!

ఆకుని చిలక చుట్టి ఒకరికొకరు తినిపించుకుంటూ సరసాలాడే సీతమ్మ రాములోరి ప్రణయాన్ని ఉపమానంగా చెప్పడం వేటూరికే చెల్లు.
చరణం 2
బృందం : లులులు హాయి దాయి దాయి దాయి
ఆమె :
వయసుచేదు తెలిసింది మనసు పులుపుకోరింది
చింతచెట్టు వెదికింది చీకటింట
రెండో చరణానికొచ్చేసరికి కాలం కొంత ముందుకు నడిచింది. పాట భావం మారింది. ఆ నాయిక తను గర్భిణినని చెప్పకనే చెప్పేసింది. ఇదివరకు రుచించిన సరసాలాటలు చేదుగా అనిపిస్తున్నాయట ఆమెకి. మనసేమో పుల్లగా తినాలని కోరుకుంటుందట. పగటివేళ వెళ్ళి చింతచిగురూ, చింతకాయలూ కోసుకు తింటే అందరికీ తెలిసిపోతుందేమోనని సిగ్గుపడి చీకటిపడ్డాక చింతచిగురూ, చింతకాయలూకోసుకుతిందట! ఎంత నర్మగర్భంగా చెప్పారు వేటూరీ!
అతడు : కొత్తకోరికేమిటో చెప్పుకోవె కోయిలా
ఆమె : ఉత్తమాట లెందుకు తెచ్చుకోర ఊయల
నాయకుడికి ఆనందం. శుభవార్త చెప్పావు, ఇప్పుడు నీకు ఏంకావాలో కోరుకో తక్షణమే తెచ్చి పెడతానన్నాడు. నాయిక నవ్వి, “ఉత్త మాటలొద్దుగానీ, ఊయల తయారు చేయించు చాలు” అంటుంది.
అతడు :
ముద్దువాన వెలిసింది… పొద్దు పొడుపు తెలిసింది…
వయసు వరస మారింది ఓరి మన్మథా
నాయికలో చాలానే మార్పొచ్చిందని అర్థమైంది నాయకుడికి. ముద్దువాన వెలిసిపోయింది, ఇదివరకులా అల్లరీ, చిలిపియాటలూ సాగవు, వయసువరసంతా మారిపోయింది! కొత్త బాధ్యతలొచ్చేస్తున్నాయని గ్రహించాడు నాయకుడు.
బృందం : మూడుముళ్ళ జంటలోన ముగ్గురైన ఇంటిలోన జోరుకాస్త తగ్గనీరా జోజోజో
ఇంతలో బారసాలకొచ్చిన అమ్మలక్కలు, “అబ్బాయ్, మీరు ఇప్పుడు ఇద్దరు కాదు! ఇంట్లో ముగ్గురున్నారని గుర్తుపెట్టుకుని జోరుకాస్త తగ్గించి వ్యవహరించాలి” అని నాయకుడికి ఉపదేశాలు చెప్తున్నారు.
ఇంత చక్కని పాటని మనకందించిన వేటూరిని నిత్యం స్మరించుకుందాము.
పాటని ఇక్కడ వీక్షించండి!

పాటని ఇక్కడ వీక్షించండి!

ఈ వ్యాసం veturi.in బ్లాగులో 23 May 2012 లో ప్రచురితమైనది.

07 అక్టోబర్ 2011

ఈ మధుమాసంలో ఈ దరహాసంలో...


తెలుగుతనం నిండిన పాట. వేటూరి రాయగా చక్రవర్తి గారు స్వరపరచినది. బాలు, సుశీల గార్ల గళంలో అమృత వర్షమే! మనసు పులకొస్తుంది నాకు ఈ పాటలోని సాహిత్యం వుంటుంటే..

పల్లవి
అతడు :  
ఈ మధుమాసంలో ఈ దరహాసంలో
మదిలో కదిలి పలికే కోయిల
బ్రతుకే హాయిగా

ఆమె :
ఈ మధుమాసంలో ఈ దరహాసంలో
మదిలో కదిలి పలికే కోయిల
బ్రతుకే హాయిగా

చరణం 1
అతడు :
ఆకాశం అంచులు దాటే ఆవేశం నా గీతం
అందులోని ప్రతి అక్షరము అందమైన నక్షత్రం

ఆమె :
అ గీతం పలికిన నా జీవితమే సంగీతం
సంగమించు ప్రణయంలొ ఉదయరాగ సిందూరం
అతడు : ప్రేమే పెన్నిధిగా ఆమె : దైవం సన్నిధిగా 
సమశ్రుతిలో జతకలిసి
ఆమె :
ప్రియలయలొ అదమరచి
అనురాగాలు పలికించు వేళ

చరణం 2
ఆమె :
 అందమైన మన యిల్లు అవని మీద హరివిల్లు
ఋతువులెన్ని మారినా వసంతాలు వెదజల్లు
అతడు :
తెలవారిన సంజెలలొ తేనెనీటి వడగళ్ళు
జ్ఞాపకాల నీడలలొ కరుగుతున్న కన్నీళ్ళు
  ఆమె : ఒకటే ఊపిరిగా అతడు : కలలే చూపులుగా
మనసులలో మనసెరిగి
అతడు :
మమతలనే మధువొలికె
శుభయోగాలు తిలకించు వేళ


========================
ఇక్కడ వినండి
========================
 
ఇక్కడ వీక్షించండి


======================================================
చిత్రం / Movie : కొండవీటి సింహం /konDaveeTi simham
సాహిత్యం / Lyrics : వేటూరి / vETUri
గళం / Singers : బాలు, సుశీల / bAlu, suSeela
సంగీత్రం / Music : చక్రవర్తి / chakravati
======================================================
In RTS format -

pallavi
ataDu :
ee madhumAsaMlO ee darahAsaMlO
madilO kadili palikE kOyila
bratukE hAyigA

Ame :
ee madhumAsaMlO ee darahAsaMlO
madilO kadili palikE kOyila
bratukE hAyigA

charaNaM 1
ataDu :
AkASaM aMchulu dATE AvESaM nA geetaM
aMdulOni prati aksharamu aMdamaina nakshatraM
Ame :
A geetaM palikina nA jeevitamE saMgeetaM
saMgamiMchu praNayaMlo udayarAga siMdUraM

ataDu : prEmE pennidhigA
Ame : daivaM sannidhigA

ataDu : samaSrutilO jatakalisi

Ame :
priyalayalo adamarachi

anurAgAlu palikiMchu vELa


charaNaM 2
Ame :
aMdamaina mana yillu avani meeda harivillu
Rtuvulenni mArinA vasaMtAlu vedajallu

ataDu :
telavArina saMjelalo tEneneeTi vaDagaLLu
j~nApakAla neeDalalo karugutunna kanneeLLu

Ame : okaTE UpirigA
ataDu : kalalE chUpulugA

Ame :
manasulalO manaserigi

ataDu :
mamatalanE madhuvolike
SubhayOgAlu tilakiMchu vELa

=============================================

27 సెప్టెంబర్ 2011

ఏ గగనమో కురుల జారి నీలిమైపోయే...

వలచినవాడు తన అందాన్ని పొగుడుతుంటే  ప్రియురాలు ఎంత పరవశపడతుందో - అంతే పరవశానికి లోనౌతాడు ఆ ప్రియుడు! ఆ ప్రియుడి కంటికి తనప్రియురాలు ఎప్పుడూ అందంగానే కనబడుతుంది. తన ప్రియురాలిని మించిన అందగత్తెలులేదు ప్రపంచంలో. ఇక్కడ అందం అన్నది ఆకృతి మాత్రమేకాదు - అంతర్లీనంగా వారిమధ్యనున్న ప్రేమకూడా. ఎంతపొగిడినా కొత్త కొత్త భావాలు పుడుతుంటాయ్ ప్రియుడికి; ఎంత పొగిడించుకున్నా తనివి తీరదు ప్రియురాలికి.

మన చరిత్రల్లో అందగత్తెలుగా చెప్పబడిన దమయంతి, శకుంతల, శుభద్ర, ద్రౌపది, సత్యవతి, ఇంకా ఎందర్నో ఊహించి చిత్రించిన చిత్రకారుడు రవివర్మ. ఆయన ఊహకుమించిన అందగత్తెలుండరంటారు. అయితే ఈ ప్రియుడేమో ఆ రవివర్మ ఊహలకన్నా ఎక్కువ నీ అందం అంటున్నాడు ఈ ప్రియుడు - ఆ ప్రియురాలెంత పులకించిపోవాలి?

ప్రియురాలి అందాలను వేటూరి మాటల్లో విందామా?
పల్లవి :
రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
రవి చూడని పాడని నవ్య నాదానివో


చరణం 1
ఏ రాగమో తీగ దాటి ఒంటిగా నిలిచే
ఏ యోగమో నన్ను దాటి జంటగా పిలిచే
ఏ మూగ భావాలో అనురాగ యోగాలై
నీ పాటలే పాడనీ


చరణం 2
ఏ గగనమో కురుల జారి నీలిమైపోయే
ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమైపోయే
ఆ కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలై
కదలాడనీ పాడనీ
================================
ఇక్కడ వినండి
================================

చిత్రం : రావణుడే రాముడైతే
సంగీతం : GK వెంకటేష్
గళం : బాలు, జానకి

pallavi :
ravivarmakE andani okE oka aMdAnivO
ravi chUDani pADani navya nAdAnivO

charaNaM 1
E rAgamO teega dATi oMTigA nilichE
E yOgamO nannu dATi jaMTagA pilichE
E mEga bhAvAlO anurAga yOgAlai
nee pATalE pADanee

charaNaM 2
E gaganamO kurula jAri neelimaipOyE
E udayamO nuduTa chEri kuMkumaipOyE
A kAvya kalpanalE nee divya SilpAlai
kadalADanee pADanee

Movie : rAvaNuDE rAmuDaitE
Music : GK Venkatesh
Singers : Balu, Janaki

22 మే 2011

చావులేని మీ రాతలేగా మా తోడు ఉన్నది...




నేటికి ఒక్క ఏడాదైయింది - తెలుగు సినిమాల్లో పాటల పారిజాతాలను పూయించిన చెట్టు కొత్త పూవులనివ్వడం మానుకొని. కొత్త పువ్వులు లేవుగాని, పాతపువ్వులు మాత్రం తెలుగు భాష ఉన్నంత కాలం సుగంధాన్ని విరజిమ్ముతూనే ఉంటాయి. అటువంటి నిత్య పరిమళ పూవులను తెలుగుపాటల్లో పూయించిన ఘనత వేటూరి సుందరరామమూర్తి గారిదే. మానవుడి జీవితంలో చోటుచేసుకునే ప్రతి సంఘటనకీ సరిపోయే సందర్భోచితమైన పాటలు ఎన్నెన్నో రాశారు గురువు గారు. చివరికి మరణాన్ని కూడా క్లుప్తంగా, అద్భుతంగా, పామరభాషలో పాటగా రాశారు. మరణం బాధపడే విషయం కాదు, అది మరో అంతస్తుకు తీసుకెళ్ళే ప్రక్రియ అన్నారు! నా స్వార్థమో ఏమోగాని ఆయన పై అంతస్తుకుడు ఎక్కడాన్ని మనసు అంగీకరించలేదు! కన్నీళ్ళు ధారలై  కారేలా ఏడ్చాను. గత 14 వసంతాలుగా నేను ఆరాధిస్తున్న సినిమా కవి వేటూరి. ఆయన పాటలు నా చెవుల్లో పడని రోజంటూలేదు; ఆయన రచించిన పదాలు రోజులో ఏదో ఒకసమయానైనా నా పెదవులు పలకవలసిందే!

అప్పుడప్పుడూ ఆయన లేరన్న నిజాన్ని ఓదారుస్తూనే నాకు గుర్తుచేసే పాట ఇది...

======================
======================

పల్లవి
చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు
ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు


చరణం 1
తల్లడిల్లి పోతుంది తల్లి అన్నది
బొట్టురాల్చుకుంటుంది కట్టుకున్నది
పాడెయెత్తడానికే స్నేహమన్నదీ
కొరివి పెట్టడానికే కొడుకు వున్నదీ


చరణం 2
పోయినోడు ఇకరాడు ఎవడికెవడు తోడు
ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు
నువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నది
కన్నీళ్ళకు కట్టె కూడా ఆరనన్నది
చావు బతుకులన్నవి ఆడుకుంటవి
చావులేని స్నేహమే తోడు వుంటది

చిత్రం : జెమిని
గళం : వందేమాతరం శ్రీనివాస్
సంగీతం : ఆర్ పి పట్నాయక్
దర్శకత్వం : శరణ్
======================
======================





చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు
ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు


తల్లడిల్లి పోతుంది తల్లి అన్నది - వేటూరి మరణించకు ముందే వారి తల్లి మరణించారు. కానీ వేటూరి మరణ వార్త విని తట్టుకోలేక తెలుగుతల్లి ఏడ్చినది వాస్తవం!

బొట్టురాల్చుకుంటుంది కట్టుకున్నది - ఆయన మృతదేహాన్ని చివరిసారిగా చూద్దామని హైదరాబాదు వెళ్ళాను. వార్త విన్నప్పటినుంచి అక్కడికి వెళ్ళి చూశాకా కూడా గుండలనిండా బాధే ఉన్నదికాని, గట్టీగా ఏడుపో, కన్నీళ్ళో రాలేదు. విలపిస్తున్న వేటురి గారి సతీమణిని చూడగానే నాకళ్ళు కొలనులైపోయాయి. అప్పటికర్థమైంది నిజానికి తెలుగు సాహిత్య ప్రపంచానికన్నా ఎక్కువగా నష్టపోయినది ఈవిడే అన్న వాస్తవం. ఎంత అపురూపంగా చూసుకుని ఊంటారో?

పాడెయెత్తడానికే స్నేహమన్నదీ - మృతదేహానికి స్నానం చేయించడానికి కొంచం పక్కకు తరలించవలసినప్పుడు ఆయన ఉన్న శవపేటికను ఎత్తే భాగ్యం ఈ ఏకలవ్యుడికి కలిగింది.
పోయినోడు ఇకరాడు ఎవడికెవడు తోడు - మీ పాటలే మాకిక తోడు!
వున్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు - మీ రచనలే మాకు చెరిగిపోని గురుతులు!

==============================================

Movie : Gemini

Singer  : Vandemataram Srinivas

Music : R P Patnaik

darSakatvaM : SaraN


pallavi

chukkallOkekkinADu chakkanODu

eppaTikee evvarikee chikkanODu


charaNaM 1

tallaDilli pOtuMdi talli annadi

boTTurAlchukuMTuMdi kaTTukunnadi

pADeyettaDAnikE snEhamannadee

korivi peTTaDAnikE koDuku vunnadee


charaNaM 2

pOyinODu ikarADu evaDikevaDu tODu

unnavADu pOyinODi gurutu niluputADu

nuvvu tinna mannErA ninnu tinnadi

kanneeLLaku kaTTe kooDA Aranannadi

chAvu batukulannavi ADukuMTavi

chAvulEni snEhamE tODu vuMTadi


==============================================

17 అక్టోబర్ 2010

కొండంతబరువు, గుండె చెరువు ఓ నత్తగుల్ల బతుకు ఇది...

వేటూరి చివరిగా పాటలు రాసిన చిత్రం మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన విలన్(రావణన్).

పాటల విషయానికొస్తే, వీళ్ళు హరివిల్లుల? అమ్మాయిలా? అని జనం నివ్వెరబోయే స్టెల్లా మేరీస్ కళాశాల అమ్మాయిలు అడుగడుగునా కనబడే 'కథీడ్రల్ రోడ్డు'లో కారులో వెళుతూ రాసినా, కేర్ హాస్పిటల్ లో మరణశయ్యపై పడుకుని యమపాశాన్ని చూస్తూ రాసినా ఆయన పాటలోని ఊపు ఏ మాత్రమూ తగ్గదు. డబ్బింగ్ చిత్రానికి పాటలు రాసేటప్పుడు ఎదురయ్యే రొటీన్ కష్టాలు ఈ పాటకూ తప్పలేదు. కొన్ని తమిళ భావాలూ/పదాలూ అలానే తీసుకుని తనదైన శైలీలో వేటురి గారు రాసిన పాట ఇది. రహ్మాన్ ఖాతాలో చోటుచేసుకున్న మరో మంచి మెలోడి ట్యూన్. తమిళానికి వైరముత్తు, హిందీకి గుల్జార్ లు రాశారు. హింది వర్షన్ లో సాహిత్యం ఎలా ఉందో నాకు తెలియదు. అయితే తమిళ వర్షన్ కి ఏమాత్రమూ తగ్గకుండ ఒక parallel lyric రాశారు వేటూరి గారు.

చిత్రం : విలన్ ౨౦౧౦
గాయకులు : అనురాధా శ్రీరాం, నరేష్ అయ్యర్
సంగీతం : ఏ ఆర్ రహ్మాన్
రచన : వేటూరి

పల్లవి
కానల చిలక కానల చిలక ఏ కాన చిలక ఇది
చినుకౌతుందో? పిడుగౌతుందో? మాయమైపోతుందో!
కులుకుమని మెరుపొస్తే - వస్తే
ఉలికిపడి నేనుంటే - ఉంటే

ఎందుకో చెప్పగరాని తప్పుడు వాంఛ కలిగినదే
అది పెట్టిన ఎర్రనిబొట్టది, నా గుండెకు గుచ్చుకుపోయెనే...
కొస చూపుకు ఎముకలు పొడిపొడి ఆయెనే

ఏవరో ఎవరో ఈ చిలకెవరో ఎక్కడి చిలక ఇది
చినుకౌతుందో పిడుగౌతుందో మాయమైపోతుందో

కాలికి సిరులు గాలికి కురులు కన్నలోకమే సై సై
తుమ్మెదలంటని కమ్మని మోమును కన్న వనాలే హాయ్ హాయ్

చరణం 1

పరువాలపాపిటిలో తిరిగాను ఒంటరిగా
అధరాల కనుమలలో పడికొట్టుకుంటున్నా
ఎటూపోని మనసు గురిసడలి విరహముతో పొగలినది

కొండంతబరువు, గుండె చెరువు, ఓ నత్తగుల్ల బతుకు ఇది
ఎర్రని మడమ ముక్కు సొగసు పిచ్చివాణ్ణిచేసి నవ్వుతున్నవి

చరణం 2
నాగేటి సాలులలో సాగేటి నీరనుకో
నీగీటుదాటని నా మనసంత నీదనుకో

పొరుగింటి సొగసు చూసి మనసు కాస్త గట్టు దాటి పోయినది
ఓలమ్మొ ఇది తప్పో, లేక ఒప్పో - లోన కత్తిపోరు సాగుతున్నది
నన్ను నిలబెట్టి  విడగొట్టి చెడ్డ విధి వెర్రిగా నవ్వింది



======================================
తమిళ పాట - తెలుగు అనువాదము - తెలుగు పాట:
======================================
కాట్టుచ్ చిఱుక్కి కాట్టుచ్ చిఱుక్కి యార్ కాట్టుచ్ చిఱుక్కి ఇవ?

మళై కొడుప్పాళో? ఇడి ఇడిప్పాళో? మాయమాయ్ పోవాళో?
ఆడవి పోరి అడవిపోరి ఎవరి అడవి పోరి ఇది?
వర్షం ఇస్తుందో? ఉరుములా ఉరుముతుందో? లేక మాయమై పోతుందా?
 

కానల చిలక కానల చిలక ఏ కాన చిలక ఇది (విన సొంపుగా ఉన్నది తెలుగు వర్షన్ పల్లవే)
చినుకౌతుందో పిడుగౌతుందో మాయమైపోతుందో


ఈక్కి మిన్నల్ అడిక్కుదడి  యాత్తే
ఈరక్కొల తుడిక్కుదడి  యాత్తే
పుల్ల మెరుపు మెరిసెనే - అమ్మో
కాలేయం అల్లాడెనులే - అమ్మో

కులుకుమని మెరుపొస్తే - వస్తే (భావం అదే; పదప్రయోగం వేరే)
ఉలికిపడి నేనుంటే - ఉంటే (భావం అదే; పదప్రయోగం వేరే)

నచ్చుమనం మచ్చినియోడు మచ్చినియోడు మరుగుదడి
అవ నెత్తియిల్ వచ్చ పొట్టుల  ఎన్ నెంజాంకుళియే ఒట్టుదే
అవ పార్వైయిల్ ఎలుంబుగ పల్పొడి ఆచ్చే
విషపూరిత మనసు మరదలుతోటి మరదలితోటి సోలుతున్నదిలే
దాని నుదుట పెట్టిన బొట్టులో నా గుండెకాయే అంటుకున్నదిలే
దాని చూపులో ఎముకలు దంతపొడి అయ్యనే (ఇక్కడ వైరముత్తు భావమే గొప్పగా ఉన్నది)
 

ఎందుకో చెప్పగరాని తప్పుడు వాంఛ కలిగినదే (కొత్త భావము)
అది పెట్టిన ఎర్రనిబొట్టది, నా గుండెకు గుచ్చుకుపోయెనే  (భావం అదే; పదప్రయోగం వేరే)
కొస చూపుకు ఎముకలు పొడిపొడి ఆయెనే 

యారో ఎవళో యారో ఎవళో యార్ కాట్టుచ్ చిఱుక్కి ఇవ?
మళై కొడుప్పాళో? ఇడి ఇడిప్పాళో? మాయమాయ్ పోవాళో?
ఎవరో ఎవతో ఎవరో ఎవతో  ఎవరి అడవి పోరి ఇది?
వర్షం ఇస్తుందో? ఉరుములా ఉరుముతుందో? లేక మాయమై పోతుందా?
ఏవరో ఎవరో ఈ చిలకెవరో ఎక్కడి చిలక ఇది
చినుకౌతుందో పిడుగౌతుందో మాయమైపోతుందో

తండై అణింజవ కొండై సరింజదుం అండసరాసరం పోచ్చు
వండు తొడాముగం కండు వనాందరం వాంగుదే పెరుమూచ్చు
అందెలు తొడిగినమగువ కొప్పు జారగ అండబ్రహ్మాండము కూలెను
తుమ్మెదతాకని (పువ్వుపోలిన) ముఖము చూసి వనాంతరం నిట్టూర్చెను
 

కాలికి సిరులు గాలికి కురులు కన్నలోకమే సై సై (మిత్రులెవరైనా ఈ లైన్ కి అర్థము చెప్తే బాగుండు)
తుమ్మెదలంటని కమ్మని మోమును కన్న వనాలే హాయ్ హాయ్ (భావం అదే; పదప్రయోగం వేరే)

చరణం 1
ఉచ్చందల వగిడు వళి ఒత్త మనం అలైయుదడి

ఒదట్టువరి పళ్ళత్తుల ఉసిరు విళుందు తవిక్కుదడి
పాళాప్పోన మనసు పసియెడుత్తు కొణ్డ పత్తియత్త ముఱిక్కుదడి
నుదుటి పాపిటదారిలో ఏకాకిలా (నా) మనసు తిరుగుతున్నది
అదరమదతలోని(lip-wrinkle) పల్లములో (నా) ప్రాణం పడి అలమటిస్తున్నది
పాశిన మనసు ఆకలిగొని పూనిన పథ్యాన్ని మరిచెనులే
 

పరువాలపాపిటిలో తిరిగాను ఒంటరిగా (భావం అదే; పదప్రయోగం వేరే)
అధరాల కనుమలలో పడికొట్టుకుంటున్నా (భావం అదే; పదప్రయోగం వేరే)
ఎటూపోని మనసు గురిసడలి విరహముతో పొగలినది (కొత్త భావము)


పాఱాంగల్ల సుమందు వళి మఱందు  ఒరు నత్తక్కుట్టి నగరుదడి
కెణ్డక్కాలు సెవప్పుం మూక్కు వనప్పుం  ఎన్నక్ కిఱుక్కును సిరిక్కుదడి
బండరాయిని మోస్తూ దారితప్పి ఒక నత్తపిల్ల పాకుతున్నది
(నీ)పిక్కల ఎఱుపూ ముక్కు సొగసూ నన్ను పిచ్చోడని నువ్వుతున్నాయి
 

కొండంతబరువు, గుండె చెరువు ఓ నత్తగుల్ల బతుకు ఇది (వినుచుండగా తెలుగు భావమో ఇంపుగా/గొప్పగా ఉన్నది)
ఎర్రని మడమ ముక్కు సొగసు పిచ్చివాణ్ణిచేసి నవ్వుతున్నవి (వినుచుండగా తెలుగు భావమో ఇంపుగా/గొప్పగా ఉన్నది)

చరణం 2

ఏర్ కిళిచ్చ తడత్తు వళి నీర్ కిళిచ్చు పోవదు పోల్ (Typical వైరముత్తు భావం)
నీ కిళిచ్చ కోట్టు వళి నీళుదడి ఎంపొళప్పు
నాగలి గీసిన సాలులో నీరు దూసుకెళ్ళినట్టు
నువ్వు గీసిన గీటులో సాగెను నాబ్రతుకు
 

నాగేటి సాలులలో సాగేటి నీరనుకో
నీగీటుదాటని నా మనసంత నీదనుకో


ఊరాన్ కాట్టు కనియే ఒన్న నెనచ్చు నెంజు సప్పుక్కొట్టిత్ తుడిక్కుదడి
యాత్తే ఇదు సరియా ఇల్ల తవఱా నెంజిల్ కత్తిచ్ సణ్డై నడక్కుదడి
ఒన్న మున్న నిఱుత్తి ఎన్న నడత్తి కెట్ట విది వందు సిరిక్కుదడి(ఈ లైన్ లు తమిళంలో బావున్నాయి)
పరాయివారి అడవిఫలమా నిన్ను తలచి మది లొట్టెలేసి తపించెనే
అమ్మో ఇది ధర్మమో అధర్మమో తెలియక మదిలో కత్తి యుద్ధము జరిగుతున్నది

నిన్ను ముందునిలిపించి నన్ను (నీవైపు) నడిపించి కుళ్ళిన విధి నవ్వుతున్నది
 

పొరుగింటి సొగసు చూసి మనసు కాస్త గట్టు దాటి పోయినది  (భావమూ; ప్రయోగమూ వేరే)
ఓలమ్మొ ఇది తప్పో, లేక ఒప్పో - లోన కత్తిపోరు సాగుతున్నది
నన్ను నిలబెట్టి  విడగొట్టి చెడ్డ విధి వెర్రిగా నవ్వింది


తమిళ చిత్రం : రావణన్
తమిళ గాయకులు : అనురాధా శ్రీరాం, శంకర్ మహాదేవన్
సంగీతం : ఏ ఆర్ రహ్మాన్
తమిళ రచన : వైరముత్తు
--------------------------------------
RTS format lO telugu lyrics
--------------------------------------
citraM : vilan / villain
gaayakulu : anuraadhaa SrIraaM, narEsh ayyar
saMgItaM : A R rahmaan
racana : vETUri

pallavi
kaanala cilaka kaanala cilaka E kaana cilaka idi
cinukautuMdO piDugautuMdO maayamaipOtuMdO
kulukumani merupostE - vastE
ulikipaDi nEnuMTE - uMTE

eMdukO ceppagaraani tappuDu vaaMCha kaliginadE
adi peTTina erraniboTTadi, naa guMDeku guccukupOyenE...
kosa cUpuku emukalu poDipoDi aayenE

EvarO evarO I cilakevarO ekkaDi cilaka idi
cinukautuMdO piDugautuMdO maayamaipOtuMdO

kaaliki sirulu gaaliki kurulu kannalOkamE sai sai
tummedalaMTani kammani mOmunu kanna vanaalE haay haay

caraNaM 1
paruvaalapaapiTilO tirigaanu oMTarigaa
adharaala kanumalalO paDikoTTukuMTunnaa
eTUpOni manasu gurisaDali virahamutO pogalinadi

koMDaMtabaruvu guMDe ceruvu O nattagulla batuku idi
errani maDama mukku sogasu piccivaaNNicEsi navvutunnavi

caraNaM 2
naagETi saalulalO saagETi nIranukO
nIgITudaaTani naa manasaMta nIdanukO

porugiMTi sogasu cUsi manasu kaasta gaTTu daaTi pOyinadi
Olammo idi tappO, lEka oppO - lOna kattipOru saagutunnadi
nannu nilabeTTi  viDagoTTi ceDDa vidhi verrigaa navviMdi

24 సెప్టెంబర్ 2010

రాసే చేతికి మోమాటం...


నిద్రలో కలలకన్నా పగటిపూట తీరిగ్గా కూర్చుని కనే కలలు ఎంతో ఆనందంగా ఉంటాయి. ఎందుకంటే నిద్రలో కలల topic మఱియూ theme మీద మనకు కంట్రొల్ ఉండవు. అయితే పగటిపూట కూర్చుని కనే కలలో మనమనసుకు ఆ సమయాన ఆహ్లాదమిచ్చే topic మఱియూ theme నే ఎంచుకుంటాము. అదీ యవ్వనంలో కనే పగటికలలు ఎంతో మధురమైనవి. చిలిపితనాన్నంతా inkలాచేసి పెన్నులోపోసి రాసిన ప్రేమలేఖలా ఉంటుంది. పెళ్ళి నిశ్చయమయ్యాక పెళ్ళిరోజుకై నిరీక్షిస్తున్న కన్నెపిల్ల కనే కలలను కాబోయోవారికి లేఖగా రాస్తే ఆ ఊహలు ఎంత మధురాతిమధురంగా ఉంటాయో. పల్లెటూరికేగల అమాయకత్వమూ గడుసుదనమూ నిండిన పదహారణాల తెలుగమ్మాయి కాబోయేవారికి తన కలలనూ కోర్కెలనూ లేఖరాస్తే ఎలా ఉంటుంది? ఈ పాటలా ఉంటుంది...

చిత్రం :: పెళ్ళి సందడి
సంగీతం :: యం యం కీరవాణి
గాయకులు :: చిత్ర
రచన : వేటూరి

కాబోయే శ్రీవారికి ప్రేమతో రాసి పంపుతున్న ప్రియరాగాలై లేఖ

పల్లవి
మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే
మా తోట చిలకమ్మ నీకోసం ఎదురే చూసే
నిన్ను చూసినాక నిదరైన రాక మనసే పెళ్ళి మంత్రాలు కోరిందని
బిగి కౌగిట హాయిగ కరిగేది ఏనాడని... అంటూ
విడ్డూరం కాకపోతే జాంచెట్టు ఎదురు చూడ్డమేంటి? చిలకమ్మ కుశలం అడగడం ఏంటంటున్నారా? అదే ప్రేమకున్న పవర్. చుట్టురా ఉన్న ప్రతి వస్తువుకీ మానుష్యాన్ని పోస్తుంది. నిన్ను చూసిన రోజునుంచి రాత్రీ-పగలూ అని తేడా లేకుండా మధురమైన కలలో మునిగిపోయి పెళ్ళిమంత్రాలు వినుటకై వీక్షిస్తూ ఉంది నా మనసు. మహాశయా నీ బిగి కౌగిట ఆనందంగా, హాయిగ కరిగిపోయేది ఎప్పుడో? ప్రేమలేఖను ఇంతకన్నా గొప్పగా మొదలుపెట్టడాని వీలుందా?

Yes, you are my dream girl
నా కలల రాణి నా కళ్ళ ముందు; అద్భుతం, అవును అద్భుతం, మన కలయిక అద్భుతం!
ఈ కలయిక ఇలాగే ఉండాలి! Promise? Promise!


చరణం 1
నిన్ను చూడందే పదే పదే పడే యాతన; తోట పూలన్నీ కనీ వినీ పడే నా వేదన
నువ్వు రాకుంటే మహాశయా మదే ఆగునా? పూల తీగల్తో పడే ఉరే నాకింక దీవెన
చూసే కన్నుల ఆరాటం రాసే చేతికి మోమాటం తలచి వలచి పిలచి అలసి
నీరాకకోసం వేచియున్న ఈ మనసుని అలుసుగ చూడకని... అంటూ...
నిన్ను చూడకుండ నా మనసు ఎంత యాతన పడుతుందీ నీకు తెలుసా? నా తలలో తురుముకునే ఈ తోటలోని పువ్వులనడుగు అవి చెప్తాయి నా వేదనను నీకు. నీ రాకకై నా మది పరిపరి వదాలుగా పరితపిస్తుంది. నువ్వుగనుక రాకపోతివా ఈ పూవ్వుల తీగలతో ఉరేసుకుంటాను. ఇక్కడ వేటురి ఎంత చమత్కారో తెలుస్తుందా? లేకపోతో గొంతుకు పడే ఉరిని ఎవరైనా దీవెన అని వర్ణించగలరా? నీకై నిరీక్షించి చూస్తున్న కన్నులలో ఎంతో ఆరాటం. నిన్ను వలచి నీ గురించి తలచి నా మది కంటున్నా చిలిపి కలలను లిఖించుటకు నా చేతులు మొహమాటపడుతున్నాయి. ప్రాణాలంతా నీమీదే పెట్టుకునున్నాను; అందుకని నన్ను అలుసుగ తీసుకోకు...

చరణం 2
పెళ్ళిచూపుళ్ళో నిలేసిన కథేమిటోమరి? జ్ఞాపకాలల్లో చలేసిన జవాబు నువ్వని
సంధ్య పొద్దుల్లో ప్రతీక్షణం యుగాలయ్యినా; నీటికన్నుల్లో నిరీక్షణం నిరాశ కాదని
తప్పులు రాస్తే మన్నించు తప్పక ధర్శనం ఇప్పించు యదటో నుదుటో యచటో మజిలి
నీమీద ప్రాణం నిలుపుకున్న మా మనవిని విని దయ చేయమని... అంటూ....
సరే ఆరోజు పెళ్ళిచూపుల్లో అందరి మధ్యన సిగ్గుతెరలలో తలవంచుకుని ఉన్న నామీద చూపులేఖ విసిరావే? దాని భావమేంటయ్యా? చలికాలం నా ఏకాంతన్ని వేదించుతుంటే నీ జ్ఞాపకాలతో చలికాచుకుంటున్నాను. రోజంతా ఎలానో నీ గురించిన ఆలోచనలతో గడిపేస్తున్నాను. ఈ సాయంత్రమైతేనే పెద్ద ఇబ్బంది. చీకట్లో సమయానికి కళ్ళుకనపడడంలేనట్టుంది. క్షణదూరం కదలటానికి యుగమంత సమయం పడుతున్నట్టుంది. నీరుపొంగుతూ నీకై నిరీక్షిస్తున్న నా కన్నులను నీరాశపరచకు. ఈ లేఖలో ఏమైనా తప్పులు రాసుంటే మన్నించు. అయితే తప్పకుండా దర్శన భాగ్యం మాత్రం అందించు. నీ దర్శనానికై ఎదలోనో నుదిటిమీదో ప్రాణం పెట్టుకుని ఎదురు చూస్తున్నాను.

Tail Note :
అవి నా కాలేజీ రోజులు. టీవీ నిత్యావసర వస్తువుగా అప్పటికి మారలేదు. వినే శ్రోతల Creativity జ్వాలకు ఆజ్యం పోసే రేడియో రోజులు అవి. సాయంత్రం మూడింటికి కాలేజీ అయిపోగానే స్నేహితుల బృందంతో మెరినా బీచ్ కి వెళ్ళి సాగరతీరాన ఓ రెండు గంటలు కూర్చుని రేడియోపాటలు వింటూ కాలక్షేపం చేసిఇళ్ళకు వెళ్ళేవాళ్ళం. ఆ రోజుల్లో మెడ్రాసు రేడియోలో 4 గంటలకు తెలుగు పాటలు ప్రసారం చేసేవాళ్ళు. అప్పట్లో ప్రతిరోజూ మా పెరటి జాంచెట్టు... పాట ప్రసారమయ్యేది. అనౌంసర్లకు కూడా ఆ పాట అంత ఫేవరైట్ ఉండేది ఆ పాట. పాటంతా తెలుగుతనంతో నిండినభావాలు. ఆ పాట నాకు ఎంతగా నచ్చిందంటే "పెళ్ళంటూ చేసుకుంటే పల్లెటూరి అమ్మాయినే చేసుకుంటాను" అని ప్రకటించాను. మరికొందరు అబ్బాయిలు కూడా ఆలానే చెప్పేవారు. మా స్నేహితుల బృందంలో అమ్మాయిలు "మీ అబ్బాయిలందరూ ఇలా నిర్ణయం తీసుకుంటే మాలాంటి పట్టణం అమ్మాయిల పరిస్తితి ఎంటి?" అని ప్రశ్నించేవారు. అది జరిగిన కొంతకాలానికి ఆ సినిమా చూసే అవకాశం వచ్చినప్పుడు ఆ పాటను చూసి దర్శకుడు రాఘవేంద్రరావును ఎంతగా తిట్టుకున్నానో....

To read the above on RTS(in eglish text) click here

04 సెప్టెంబర్ 2010

నేను నీవు ఎవ్వరికెవరం వలపు చిలికెనేలా?

===================================================
ఈ పోస్ట్
చావా కిరణ్ కి
(ఈ టపా రాయడానికి ప్రేరేపణ ఇచ్చింది చావా కిరణ్ పెట్టిన ఒక Buzz)
===================================================

మణిరత్నం తీసిన ఇద్దరు సినిమా, వాణిజ్యపరంగా అంత హిట్ కాదు. పాటలు మాత్రం సూపర్ హిట్. సినిమా పాటల్లో సాహిత్యం కావాలనుకునే వాళ్ళకు ఈ సినిమాలో పాటలు నచ్చుతాయి. ఈ సినిమా తమిళంలో తీశారు. 1950 ప్రాంతంలో తమిళనాడు రాజకీయ, సినీపరిశ్రమలలో జరిగిన పరిణామాల ఆధారంగా తీయబడింది.

దర్శకుడికి సాహిత్య అభిరుచి ఎక్కువ. ఇది ఆయన తీసిన సినిమాలలో పాటలు వింటే అర్థం అవుతుంది. ఈ సినిమాలోని ఒక ముఖ్యపాత్ర రచయిత. మరొక పాత్ర నటుడు. మణిరత్నం ఈ సినిమాకు కవితలూ, పాటలూ ఎప్పట్లాగానే కవిరాజు వైరముత్తుగారిచే రాయించారు.  తెలుగులో దానిని తలతన్నేవిదంగా రాశారు వేటూరి గారు.

ఈ తమిళ పాటకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ పాటలోని భాష సంగం(2000 years old) నాటి పద్యభాష. ఇందులోని ఏ ఒక్క పదముకూడా ఇంతకు మునుపు వచ్చిన సినిమా పాటలలో కనపడవు.

తెలుగు వర్షన్ లో సాహిత్యం గొప్పగా ఉందా లేక తమిళ వర్షన్ లో సాహిత్యం గొప్పగా ఉందా అనికాకుండ రెండిట్లోను సాహిత్యం గొప్పగానే ఉంది అన్నది నా భావన...

చిత్రం : ఇద్దరు
రచన : వేటూరి సుందరరామమూర్తి
సంగీతం : ఏ.ఆర్. రహ్మాన్
కంఠస్వరం : ఉన్నికృష్ణన్, బి.జయశ్రీ


పల్లవి :
 

అతడు :
శశివదనే శశివదనే స్వర నీలాంబరి నీవా
అందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగ రావా
అచ్చోచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గుచ్చెత్తేటి కులుకుసిరి నీదా?
(తమిళం)
నఱుముగైయే నఱుముగైయే నీయొరు నాళిగై నిల్లాయ్
సెంగని ఊఱియ వాయ్ తిఱందు నీయొరు తిరుమొళి సొల్లాయ్
అట్రైత్ తింగళ్ అన్నిలవిల్ నెట్రిత్ తరళ నీర్ వడియ కొట్రప్ పొయ్‌గై ఆడియవళ్ నీయా?
పరిమళించే మొగ్గ పోలిన దానా నువ్వొక  గడియ ఆగుము
కెంపుఫలములూరిన నోరు విప్పి నువ్వొక శుభవార్త చెప్పు
అలజాబిలి వెన్నెలలో నుదుట ముత్యాల్లా నీరుజారగ తటాకమున జలకాలాడినది నీవా?
(నాళిగై - గడియ - 24 నిముషాలు; 60 గడియలు ఒక రోజు. తింగళ్ - జాబిలి )

ఆమె :

నవమదనా నవమదనా కలపకు కన్నుల మాట
శ్వేతాశ్వమ్ముల వాహనుడా విడువకు మురిసిన బాట
అచ్చోచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గిచ్చే మోజు మోహనమే నీదా?
(తమిళం)
తిరుమగనే తిరుమగనే నీయొరు నాళిగై పారాయ్

వెణ్ణిఱ పురవియిల్ వందవనే వేల్విళి మొళిగళ్ కేళాయ్
అట్రైత్ తింగళ్ అన్నిలవిల్ కొట్రప్పొయ్గై ఆడుగైయిల్ ఒట్రైప్పార్వై పార్తవనుం  నీయా?
శ్రీమంతుడా శ్రీమంతుడా నువ్వొక గడియ చూడవోయ్
తెల్లటి గుఱ్ఱంలో వచ్చినవాడా, ఈటెకన్నులుగల నా పలుకులు వినవోయ్
అలజాబిలి వెన్నెలలో తటాకంలో నే జలకాలాడుతుండగ ఒక్క చూపు విసిరినది నీవా?


చరణం 1

అతడు : మదన మోహిని చూపులోన మాండు రాగమేల?
ఆమె   : పడుచు వాడిని కన్న వీక్షణ పంచదార కాదా?
అతడు : అలా ఇలా మేఘ మాసం క్షణానికో తోడి రాగం!
ఆమె   : చందనం కలిసిన ఊపిరిలో కరిగే మేఖల కటిని గిల్లే!


తమిళ చరణం 1

అతడు : మంగై మాన్విళి అంబుగళ్ ఎన్ మార్బుళైత్తదెన్న?
(మగువ 'లేడి' కన్నుల బాణాలు/తూపులు నా రొమ్ముచీల్చుతున్నదేమిటి)
ఆమె : పాండి నాడనై కణ్డు ఎన్ ఉడల్ పసలై కొండదెన్న?
(పాండియదేశరాకుమారుని చూసిన నా తనును విరహము చెందెనేల?)
అతడు : నిలావిలే పార్త వణ్ణం కనావిలే తోండ్రుం ఇన్నుం!
(నాడు వెన్నెలలో చూసిన నీ రూపం, కనులలోనే మెదిలే నేడు)
ఆమె : ఇళైత్తేన్ తుడిత్తేన్ పొఱుక్కవిల్లై. ఇడైయిల్ మేగలై ఇఱుక్కవిల్లై!
(నీకై (విరహంతో) చికిపోయాను, విలవిలపోయాను, ఓర్చుకోలేకపోతున్నాను.
నీ విరహంలో నేనెంతగా చిక్కిపోయానంటే  తొడిగిన ఒడ్డాణము కూడా వదులైపోయినది. నడుమున నిలబడడం లేదు)

చరణం 2

ఆమె   : నెయ్యం వియ్యం ఏధేనైన తనువు నిలువదేలా?
(నెయ్యము -వలపు; వియ్యము - వైవాహిక సంబంధం; ఏధ-ఎదుగుదల
మన వలపు కళ్యాణంవరకు ఎదిగినది, అయినా ఈ తనువు ఆగదెందుకు? - తప్పతే తెలియచేయండి)
అతడు : నేను నీవు ఎవ్వరికెవరం వలపు చిలికెనేలా?
ఆమె   : ఒకే ఒక చైత్ర వీణ పురేవిడి పూతలాయే!
అతడు : అమృతం కురిసిన రాతిరివో జాబిలి హృదయం జత చేరే!

తమిళ చరణం 2
ఆమె : యాయుం జ్ఞాయుం యారాగియరో నెంజు నేర్న్‌దదెన్న?
(మీ కన్నవారికీ, నా కన్నవారికీ ఏ బంధుత్వమూలేదు; అయినా మన ఎదలలో ఏం జరిగింది?)
అతడు : యానుం నీయుం ఎవ్వళి అఱిదుం ఉఱవు సేరందదెన్న?
(నేనూ నీవూ వేర్వేరు స్థాయి వారమని తెలిసీ మన వలపెలా కుదిరింది?)
ఆమె : ఒరే ఒరు తీణ్డల్ సెయ్దాయ్ ఉయిర్ కొడి పూత్తదెన్న?
(నీ ఒకేయొక స్పర్షతో నా ప్రాణలత పూసిందెలా?)
అతడు : సెంబులం సేరంద నీర్తుళి పోల్ అంబుడై నెంజం కలందదెన్న?
(ఎర్రమట్టి భూమిలో పడిన నీట్చుక్కలా ప్రేమించే మనసులు కలిసిందెలా?)

రెండవ తమిళ చరణం లో మూడవ లైన్ మినహా, మిగతావి 2000 వేల సంవత్సరాల క్రితం రాయబడిన కుఱుందొగైలోని పద్యం లో నుండి అలానే వాడుకున్నారు.

= = = X X X = = =
తెలుగు వర్షన్‌ని ఇక్కడ వినండి
http://www.youtube.com/watch?v=QlbdOEbzzwA

తమిళ వర్షన్‌ని ఇక్కడ వినండి
http://www.youtube.com/watch?v=joJHN_VfY88

02 సెప్టెంబర్ 2010

మనసు అడిగిన ఆ మనిషెక్కడో - నా పిలుపే అందని దూరాలలో!

22 మే 2010, శనివారం రాత్రి సమయం పదయింది. ఆషాకి ఒంట్లో బాగలేదు. డక్టర్ చెప్పిన ట్యాబ్లెట్లు వేసుకుని, నిద్రపట్టక టీవీ చూస్తుంది. నేను కంప్యూటర్లో పాటలు వింటున్నాను. ఆష గట్టిగా పిలిచింది. ఏమైందో ఏమోనని కంగారుతో వెళితే,

"వేటూరి చనిపోయారంట! ఫ్లాష్ న్యూస్ వస్తోంది" ఆష హీనస్వరంలో చెప్పింది!

అలాగే కిందకు వాలిపోయాను. మాటలు రావడంలేదు. ఇది కల అయితే బాగుండు. నన్నెవరన్నా ఇప్పుడు నిద్రలేపేయండి అని అరవాలనిపించింది! టీవీకేసి చూస్తున్నాను గాని ఆ ఫ్లాష్ న్యూస్ అక్షరాలు కనపడడంలేదు. కన్నులు కమ్మేశాయి. మరో ఛానల్ మార్చింది. అందులోనూ అదే న్యూస్ చదువుతున్నారు. కన్నీళ్ళు ఆగడం లేదు. ఇంటర్నెట్లో మిత్రులనడిగాను. వారూ అదే వార్తతో బాధపడుతున్నారు.

వేటూరి చనిపోవడం ఏంటి? అసలు అది సాధ్యమా? రాలిపోని పువ్వనుకున్నాను వేటూరిని.

నాకు కాలం స్తంబించింది. కందెన లేకుంటే భూచక్రం ఎలా తిరుగుతుంది? కన్నీళ్ళతోబాటు ఆలోచనలూ అల్లుకుపోతున్నాయ్!  ఇందాకకూడా పాట వింటూ వేటూరికి ఒక శభాష్ చెప్పానే, అయితే నా ఈ "శభాష్"ని అందుకోలేదా అయన? అంతకుముందు "చుక్కూళ్ళోకెక్కినాడు చక్కనోడు..." పాటవింటున్నప్పుడే ఆయణ ప్రాణం పోయుంటుందా? నాలో కన్నీళ్ళూ, ప్రశ్నలూ, ఆలోచనలూ పౌర్ణమి రేయి సాగరతీరంలా ఇంకా ఇంకా పెర్గుతున్నాయ్!

"నువ్వు హైదరబాదుకు వెళ్ళి చూసిరా" ఆష చెప్పింది.
"నీకు బాగలేనప్పుడు ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళను?"
"నాకేం పర్లేదు, నువ్వు వెళ్ళి చివరిసారిగా చూసిరా. తెల్లవారికి టిక్కేట్లు ఉన్నాయా చూడు" అని ల్యాప్టాప్ తెచ్చి ఇచ్చింది ఆష.

నా అధృష్టం. ఒకే ఒక 8:45 ఫ్లైట్లో మాత్రం తిక్కెట్లు ఉన్నాయ్. మోహన్‌కి ఫోన్ చేసి చెప్పాను. తనూ వస్తానన్నాడు. రెండు తిక్కెట్లు బుక్ చేశాను. ఆషాకు బాగలేదు, ఒంటరిగా వదిలేసి వెళ్ళాలి అన్న బాధ, ఇంక కొత్తగా వేటూరి పాటలు ఏవీ రావ్వు అన్న బాధ - అసలు నిద్ర రాలేదు. మనసంతా ఆయన రాసిన విషాద గీతాలు మెదలుతున్నాయ్.
నా చుట్టూ ప్రపంచం నిద్రపోతుంది. నేను మాత్రం మరణాన్నీ, వేటూరినీ నిందిస్తున్నాను! ఆయన భాషలోనే

మదికే అతిధిగ రానేలనో - సెలవైనా అడగక పోనేలనో
ఎదురుచూపుకు నిదరేది - ఊగెను ఉసురే కన్నీరై;
మనసు అడిగిన ఆ మనిషెక్కడో - నా పిలుపే అందని దూరాలలో!


ఆకలీ, నిద్ర ప్రేమలోపడ్డవారికేకాదు వియోగంలో ఉన్నవారికి కూడా ఉండవేమో. తెల్లవారి అద్ధంలో మొహం చూస్కుంటే నాకే నేను అన్యుడిలా కనపడుతున్నాను. హోసూరుకెళ్ళి మోహన్‌ని  పిక్కప్ చేసుకున్నాను. మాకు ఏం మాట్లాడుకోవాలో తోచలేదు. మౌనంగా రెండుగంటల్లో airport చేరుకున్నాము. కిటికీనుంచి ఆకాశానికేసి చూస్తున్నాను, చనిపోయిన వేటూరి గారు కూడ తారలా మారుంటాడేమోనని. వేటూరి తారగా మారడం ఏంటి? ఆయన తేజోవంతుడు; సూర్యుడౌతాడు గాని, తారకాడు! హైదరబాదులో దిగి, ఆయన నివాసం వెతికి చేరుకున్నాము. ఆయన భౌతికకాయం చూడగానే అంతవరకు ఏడ్చిన ఏడుపు ఏమైందో తెలియదు. కంట్లో ఒక చుక్క కన్నీరైనా రాదు. కొన్ని నిముషాలు వేటూరిని చూస్తూ శిలైపోయాను. "మదికే అతిథిగ రానేలనో - సెలవైనా అడగక పోనేలనో?" అని ఆయన మాటలతోనే అడుగాలనిపించింది. ఇకపైన వేటూరి కలంనుంచి ఇంకో కొత్తా పాట వినే భాగ్యం ఈ తెలుగు దౌర్భాగ్యులకు లేదు. 

చిత్రం : సఖి
 
ప్రేమలే నేరమ ప్రియా ప్రియా
వలపు విరహమా ఓ నా ప్రియా
మనసు, మమత ఆకాశమా
ఒక తారై మెరిసిన నీవెక్కడో!

పల్లవి

కలలై పోయెను నా ప్రేమలు
అలలై పొంగెను నా కన్నులు.
మదికే అతి
థిగ రానేలనో;
సెలవైనా అడగక పోనేలనో.
ఎదురుచూపుకు నిదరేది;
ఊగెను ఉసురే కన్నీరై.
మనసు అడిగిన ఆ మనిషెక్కడో;
నా పిలుపే అందని దూరాలలో!


చరణం 1

అనురాగానికి స్వరమేది?
సాగరఘోషకు పెదవేది?
ఎవరికివారే ఎదురుపడి -
ఎదలు రగులు ఎడబాటులలో.
చివరికి దారే మెలికపడి -
నిను చేరగ నేనీ శిలనైతిని!
ఎండమావిలో నావనులే -
ఈ నిట్టూర్పే నా తెరచాపలే!


చరణం 2

వెన్నెల మండిన వేదనలో,
కలువ పువ్వులా కలతపడి.
చేసిన బాసలు కలలైపోతే -
బ్రతుకే మాయగ మిగులుననీ.
నీకై వెతికా కౌగిలినై -
నీడగ మారిన వలపులతో.
అలిసి ఉన్నాను ఆశలతో -
నను ఓదార్చే నీ పిలుపెన్నడో!


ఒరిజినల్ తమిళ సినిమాలో ఈ పాట వైరముత్తు గారు 1984లో రాసిన ఒక ఛందోబద్ధమైన పద్యం. ఆ తరువాయి ఈ కవిత "తేన్ వందు పాయుదు" అన్న కవితల ఆడియో ఆల్బంలో  వైరముత్తుగారి కంఠస్వరంలో, సుహాసిని మణిరత్నం ముందుమాట కంఠస్వరంతో , రహ్మాన్ గారి నేపద్య సంగీతంలో ఆడియో రూపంలో ఎంతోమంది తమిళుల్ని ఆకట్టుకుంది. మణిరత్నం చక్కగా తన సినిమాలో (అలైపాయుదే - తెలుగులో "సఖి‌") వాడుకున్నారు. ఎంతగా నచ్చిందో ఏమో మరి ఈ పాటను అద్భుతంగా స్వరపరిచారు రహ్మాన్.

ఈ పాట సినిమాలో అశరీరిగా వస్తుంది. దీనికి తెలుగు వర్షన్ రాసేటప్పుడు మిగతా డబ్బింగు పాటలకు ఉండే లిప్ సింక్ ఇబ్బందులు అసలు లేదు. తమిళ భావాన్ని పక్కకు పెట్టేసి సినిమాలోని సన్నివేశానికి తగిన గొప్ప భావాన్ని ఎంచుకున్నారు వేటూరి గారు. ఒరిజినల్ తమిళ భావానికన్నా తెలుగు వర్షన్‌లోని భావాం చాల గొప్పగా, సినిమా సన్నివేశానికి చాలా దగ్గరగా ఉంది. వేటూరి గారి ప్రతీభను ప్రతి లైన్‌లోను చూడొచ్చు ఈ పాటలో. పాట పాడినవారు స్వర్ణలత గారు. ఆమే ఈ పాటలోని ప్రతి పదాన్ని ఎంతో అనుభవించి పాడారు.

వేటూరి తమిళ భావానికన్నా బాగరాశాడు అంటే మీరు నమ్మరేమో.
అందుకే తమిళ వర్షన్ కి డిట్టొ అనువాదం ఇస్తున్నాను ఇక్కడ.

పల్లవి
ఎవనో ఒరువన్ వాసిక్కిఱాన్ - ఇరుట్టిల్ ఇరుందు నాన్ యాసిక్కిఱేన్
తవం పోల్ ఇరుందు యోసిక్కిఱేన్ - అదై తవణై ముఱైయిల్ నేసిక్కిఱేన్
కేట్టు కేట్టు నాన్ కిఱంగుగిఱేన్ - నాన్ కేట్పదై అవఓ అఱియవిల్లై
కాట్టు మూంగిలిన్ కాదుక్కుళ్ళే - అవన్ ఊదుం రగసియం పురియవిల్లై
 

ఎవడో ఒకడు (వేణువు) వాయించుచున్నాడు - (ఇక్కడ) చీకట్లో నేను యాచించుచున్నాను
తపస్సులా ఉండి యోచించుచున్నాను - దాన్ని(వేణు గానాన్ని) తేపలుతేపలుగా ఆరాదిస్తున్నాను
వింటూనే పారవశ్యం చెదుతున్నాను - నేను వింటున్న సంగతేమో వాడెఱుగడు
ఆ అడవి వెదురు(వేణువు) చెవిలో - వాడు ఉదే రహయం అర్థంకాలేదు!


చరణం 1
పుల్లాంగుళలే పూంగుళలే నీయుం నానుం ఒరు జాతి
ఉళ్ళే ఉఱంగుం ఏక్కత్తిలే ఉనక్కుం ఎనక్కుం సరి పాది
కణ్గళై వరుడుం తేనిసైయిల్ ఎన్ కాలం కవలై మఱందిరుప్పేన్
ఇనిసై మట్టుం ఇల్లై ఎన్ఱాల్ నాన్ ఎన్ఱో ఎన్ఱో ఇఱందిరుప్పేన్


 ఓ పిల్లనగ్రోవీ! నువ్వూ నేనూ ఒకే శ్రేణికి చెందినవారము;
(వేణు గానం)లోపల దాగున్న నిట్టూర్పులో నీకూ నాకు చెరిసగము!
కనులను నిమిరే సంగీతములో సమయాన్నీ, బాధల్నీ మరిచిపోతున్నాను!
ఈ సంగీతము మాత్రం లేనిచో నేనెన్నడో మరణించి ఉంటాను!




చరణం 2
ఉఱక్కం ఇల్లా మునిరవిల్ ఎన్ ఉళ్ మనదిల్ ఒరు మాఱుదలా
ఇరక్కం ఇల్లా ఇరవుగళిల్ ఇదు ఎవనో అనుప్పుం ఆఱుదలా
ఎందన్ సోగం తీర్వతఱ్కు ఇదు పోల్ మరుందు పిరిదిల్లైయే
అంద కుళలైప్ పోల్ అళువదఱ్కు అత్తనై కణ్గళ్ ఎనక్కిల్లైయే


నిద్దురలేని రాత్రులలో నా మదిలో ఒక మార్పా
కరుణేలేని రాత్రులకు ఎవరో పంపే ఓదార్పా!
నా శోకం తీరుటకు ఇలాంటి ఔషధము వేరొకటిలేదు
ఆ గ్రోవిలా ఏడ్చుటకు అన్ని కన్నులు నాకు లేవు !


ఒరిజినల్ తమిళ పద్యం వైరముత్తుగారి కంఠస్వరంలో
http://www.youtube.com/watch?v=bzb2ojn5IZc